Telangana

స్కూల్ బస్సుల 'రాజకీయం'!

By · · Updated

Share this article
స్కూల్ బస్సుల 'రాజకీయం'!

_ కాంగ్రెస్ సభకు ప్రైవేట్ స్కూల్ బస్సు
_ శంషాబాద్ సన్నాహక సమావేశానికి విరుద్ధంగా వాహనం వినియోగం
_ పట్టభద్రుల ఎన్నికల వేళ కాంగ్రెస్ శ్రేణుల తరలింపుపై వివాదం
_ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్


తాండూరు, అక్టోబరు 22 (అభయం న్యూస్): రంగారెడ్డి - హైదరాబాద్ - మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ రచ్చ మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ వేదికగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సన్నాహక సమావేశానికి తాండూరు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
అయితే, ఈ సమావేశానికి జనాన్ని,నాయకులను తరలించే క్రమంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు తాండూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సును వినియోగించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల బస్సులను కేవలం విద్యార్థులు, ఉపాధ్యాయుల రవాణాకే ఉపయోగించాల్సి ఉంటుంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీటిపై ప్రత్యేక పన్ను మినహాయింపులు, సడలింపులతో రవాణా అనుమతులు ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ వాహనాలను రాజకీయ ప్రచారాలకు, పార్టీ సమావేశాలకు లేదా ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు ఉపయోగించకూడదని రవాణా శాఖ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ బలాన్ని నిరూపించుకునేందుకు పాఠశాల యాజమాన్యం స్కూల్ బస్సును సభకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దసరా సెలవులు ముగిసి పాఠశాలలు పునప్రారంభం ఐయే సమయం లో ఫిట్నెస్ చెకింగ్, ఇతర వాహన సదుపాయాలు చూడడం మానేసి, విద్యార్థుల రవాణా కోసం కేటాయించిన వాహనాన్ని ఇలా రాజకీయ అవసరాలకు వాడటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ సభకు బస్సును కేటాయించిన పాఠశాల యాజమాన్యంపై, బాధ్యులైన వారిపై మోటారు వాహన తనిఖీ అధికారులు, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సీజ్ లేదా జరిమానా వంటి చర్యలు తీసుకోవాలని స్థానికులు విద్యార్థి సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags: