Telangana

బీసీ నేతల ఆత్మీయ భేటీ.!

By · · Updated

Share this article
బీసీ నేతల ఆత్మీయ భేటీ.!

_ తాండూర్‌లో తీన్మార్ మల్లన్నను కలిసిన బీసీ నాయకులు

_ పర్యటనపై ముందస్తు సమాచారం లేదన్న నాయకులు.. 

_ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న మల్లన్న
రాజకీయ అవకాశాలు, బీసీ ఉద్యమంపై సుదీర్ఘ చర్చలు

అభయం తాండూరు టౌన్;  తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు, బీసీ ఉద్యమ నేత తీన్మార్ మల్లన్నను తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న తాండూర్ ప్రాంతంలో మల్లన్న చేపట్టిన పాదయాత్ర సందర్భంగా నాయకులు ఆయనతో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, స్థానికంగా బీసీలకు ఉన్న రాజకీయ అవకాశాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు.
తీన్మార్ మల్లన్న తాండూర్‌కు వస్తున్నారనే విషయం ముందస్తుగా తెలియకపోవడంతో తగిన రీతిలో స్పందించలేకపోయామని బీసీ సంఘం నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మల్లన్న స్పందిస్తూ... చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అధికారికంగా ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పారు. అయితే, తాండూర్ పర్యటన వివరాలను సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే పలుమార్లు వెల్లడించినట్లు స్పష్టం చేశారు.
అనంతరం నాయకులు పరస్పరం ఆత్మీయంగా ముచ్చటించుకొని, తాండూర్ ప్రాంతంలో బీసీ ఉద్యమ బలోపేతం, రాజకీయ సాధికారత సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ షుకూర్, బీసీ జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బస్వరాజ్, బీసీ నాయకులు పరమేశ్, వివేక్, కిరణ్, సంజూ, జోసఫ్, శ్రీకాంత్, చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Tags: