_ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రమాదకరంగా అస్తవ్యస్త పార్కింగ్
_ తీవ్ర ట్రాఫిక్ చిక్కుల్లో విద్యార్థులు, బాటసారులు
_ పట్టించుకోని పోలీసులు.. చర్యలు తీసుకోవాలని విన్నపం
తాండూరు,నవంబర్ 1(అభయం న్యూస్): పట్టణంలోని ప్రధాన రహదారులు లారీల అడ్డగా మారుతున్నాయి. ఇందిరా చౌరస్తా నుండి విలెమూన్ చౌరస్తా వరకు ఉన్న ప్రధాన మార్గంలో సాయంత్రం వేళల్లో బడా లోడ్ లారీలను నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. దీంతో ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ప్రధాన రహదారిపైనే దర్జాగా లారీలను పార్కింగ్ చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం పక్కనుంచే ఇందిరా నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఉంది. ఇటుగా వెళ్లే వారికి, ఇటువైపు నుండి ప్రధాన రహదారిపైకి వచ్చేవారికి రోడ్డుపై అడ్డంగా నిలిపిన లారీల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు అసలు కనిపించడం లేదు. దీంతో తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇక పాఠశాలలు ముగిసే సమయంలో రోడ్డుపైనే నిలిపి ఉంచుతున్న ఈ లారీల వల్ల పాఠశాల విద్యార్థులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అదేవిధంగా వినాయక చౌక్ నుండి విలెమూన్ చౌరస్తా వరకు వాహనాలను అడ్డదిడ్డంగా నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు మరీ జటిలంగా మారుతున్నాయి. ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికైనా స్థానిక పోలీస్, ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక చొరవ చూపి రోడ్డుపై లారీలను నిలిపే వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ప్రధాన రహదారులపై లారీలను పార్కింగ్ చేయకుండా ఆంక్షలు విధించి, ట్రాఫిక్ చిక్కుల నుండి తమకు ఉపశమనం కలిగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రోడ్డుపైనే లారీలు...!
By Vamshi · · Updated
Share this article







