Tandur

మున్సిపల్ కార్మికుల 'చేతివాటం'..

By · · Updated

Share this article
మున్సిపల్ కార్మికుల 'చేతివాటం'..

_ సీసీ కెమెరాలో రికార్డు!
_ పాత తాండూరు మున్సిపల్ కార్మికులపై స్థానికుల తీవ్ర ఆగ్రహం
_ గతంలోనూ పలుమార్లు వస్తువుల చోరీకి పాల్పడ్డారనే ఆరోపణలు
_ సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలు

తాండూరు, అక్టోబర్ 29(అభయం న్యూస్): తాండూరు పట్టణంలోని పాత తాండూరు ప్రాంతంలో మున్సిపల్ కార్మికులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి వివాదంలో నిలిచారు. చెత్త సేకరణ పేరుతో వెళ్లి ఇళ్ల ముందు, వీధుల్లో ఉన్న వస్తువులను కాజేస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాండూరు పట్టణ పరిధిలోని 15వ వార్డులో గురువారం ఉదయం మున్సిపల్ చెత్త వాహనం చెత్త సేకరణ నిమిత్తం వెళ్ళింది. ఈ క్రమంలో స్థానికంగా నిలిపి ఉంచిన ఓ ఆటోలో ఉన్న వస్తువులపై మున్సిపల్ కార్మికులు గోపాల్, నరేష్‌లు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆటోలోని సామగ్రిని వారు రహస్యంగా తమ వాహనంలోకి మార్చుకుంటున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ ఇంటిలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఈ విషయంపై అప్రమత్తమైన స్థానికులు వెంటనే మున్సిపల్ సిబ్బందికి, అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికులు నిలదీయగా.. కార్మికులలో ఒకరు నిర్లక్ష్యంగా బదులిచ్చినట్లు తెలుస్తోంది. మేము కావాలని దొంగతనం చేయలేదు.. ఏదో పనికి వస్తుందని తీసుకున్నాం, కావాలంటే ఆ వస్తువును మళ్ళీ అక్కడే పెట్టేస్తాం అంటూ తేలికగా మాట్లాడడం గమనార్హం.
నిందితులుగా చెబుతున్న ఇద్దరు కార్మికులు గతంలో కూడా ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడ్డారని తోటి మున్సిపల్ సిబ్బంది కూడా ఆరోపిస్తున్నారు. కొద్దిమంది కార్మికుల ఇలాంటి అనైతిక చర్యల వల్ల మున్సిపల్ శాఖ మొత్తానికి, ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు వస్తోందని పలువురు పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న కార్మికులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags: