Telangana

80% నోటీసుల పంపిణీ పూర్తి..!

By · · Updated

Share this article
80% నోటీసుల పంపిణీ పూర్తి..!

_ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పారదర్శకం
సీఈఓ సుదర్శన్ రెడ్డి

_ నోటీసులకు ఓటర్ల స్పందన తప్పనిసరి
 
_ ఆన్‌లైన్‌లోనూ పత్రాల సమర్పణకు వెసులుబాటు
 
_ క్షేత్రస్థాయిలో ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించిన రాష్ట్ర  ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి 

అభయం తాండూరు; రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సజావుగా సాగుతోందని తెలంగాణ రాష్ట్ర  ఎన్నికల అధికారి  సుదర్శన్ రెడ్డి తెలిపారు. సవరణ ప్రక్రియ నోటీసుల డిస్ట్రిబ్యూషన్, క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం ఆయన శుక్రవారం తాండూరు నియోజకవర్గ పరిధిలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటర్ల జాబితాలో సమాచార వ్యత్యాసాలు, నో-మ్యాపింగ్ కేటగిరీల్లో గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 70 నుంచి 80 శాతం మంది ఓటర్లకు నోటీసులు అందజేసినట్లు సీఈఓ వివరించారు. పనిదినాల్లో గృహాల్లో అందుబాటులో లేనివారి కోసం బిఎల్‌ఓ లు ఆదివారాలు, సెలవు రోజుల్లో కూడా ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేస్తున్నారని పేర్కొన్నారు.
 నోటీసులు అందుకున్న ఓటర్లు ఖచ్చితంగా స్పందించాలని కోరారు. తమ వద్ద ఉన్న సరైన ఆధార పత్రాలను బిఎల్‌ఓకి లేదా తహసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పరిశీలన అనంతరం వారి పేర్లను తుది ఓటరు జాబితాలో చేరుస్తామన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా డాక్యుమెంట్లు సమర్పించే సదుపాయం ఉందని, సమర్పించిన పత్రాలపై ఏవైనా సందేహాలుంటే అధికారులు నేరుగా గానీ లేదా ఫోన్ ద్వారా గానీ సంప్రదించి అవసరమైన వివరాలు సేకరిస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో నోటీసుల పంపిణీ శరవేగంగా జరుగుతోందని, హైదరాబాద్ వంటి కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కొంత సమయం పడుతున్నప్పటికీ, అనుకున్న సమయానికే ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా పక్కాగా జాబితాను రూపొందిస్తున్నామని సీఈఓ తెలిపారు.

Tags: