_ అధికారుల నిర్ణయాన్ని కాంగ్రెస్కు ఆపాదించడం సరికాదు
_ సోషల్ మీడియా రాద్ధాంతం మానాలి
_ యువజన కాంగ్రెస్ నాయకుడు పునీత్
అభయం తాండూరు టౌన్; హిందూ ఉత్సవ సమితి, అధికారులు సమన్వయంతో తీసుకున్న నిర్ణయాలకు రాజకీయ రంగు పులుముతూ సోషల్ మీడియాలో రాద్ధాంతం చేయడం తగదని యువజన కాంగ్రెస్ నాయకుడు పునీత్ అన్నారు. తాండూరు వినాయక చౌక్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు అంశంపై బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. వినాయక చౌక్ ఉత్సవ కమిటీ విన్నపం మేరకు హిందూ ఉత్సవ సమితి, ఆర్డీఓ, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా చర్చించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అధికారులు, కమిటీ ప్రతినిధులు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ నాయకులకు ఆపాదిస్తూ విమర్శలు చేయడం అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని, అంతేగానీ ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం దురదృష్టకరం అని పునీత్ అన్నారు. ప్రజాప్రతినిధిగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి తప్ప, నెట్టింట పోస్టులు పెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించడం ప్రజాసేవ కాదని హితవు పలికారు.
46 ఏళ్ల ఆధ్యాత్మిక సాంప్రదాయం
వినాయక చౌక్ ఉత్సవాలు గత 46 సంవత్సరాలుగా ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదన్నారు. అధికారుల నిర్ణయానికి కాంగ్రెస్ నాయకులను బాధ్యులను చేయడం వెనుక ఉన్న రాజకీయం ఏమిటో నాగారం మల్లేశం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిల్లర రాజకీయాలు మానుకుని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ఆయన సూచించారు.







