_ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై చర్యలు ఏవి?
_ ఎంఈఓ, డిఈఓ లను వెంటనే సస్పెండ్ చేయాలి: టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి
_ అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం
వికారాబాద్, అక్టోబర్ 26:(అభయం న్యూస్): వికారాబాద్ పట్టణంలో విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా దసరా సెలవుల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోని ఎంఈఓ, డిఈఓ లను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా ఆయన అడిషనల్ కలెక్టర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ... సెలవుల్లో పాఠశాలలు నడుపుతూ విద్యార్థులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వెనుక ఉన్న అంతర్యమేమిటో స్పష్టం చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్లపై, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.







