Tandur

తాండూరులో ఖాకీ కబ్జా..!

By · · Updated

Share this article
తాండూరులో ఖాకీ కబ్జా..!

_ దాయాదుల మధ్య చిచ్చుపెట్టి రూ.70 లక్షల భూమి కాజేసిన కానిస్టేబుల్!

_  పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో వెలుగుచూసిన దారుణం

_ నా కంట్రోల్‌లోనే ఎస్పీ, డీఎస్పీలు’ అంటూ బెదిరింపులు

_ ఖాకీకి అండగా స్థానిక రేషన్ డీలర్.. ట్రాక్టర్‌తో భూమి దున్నించి దౌర్జన్యం

_  జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న బాధితులు

తాండూరు, అక్టోబర్ 6 (అభయం న్యూస్):
రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారాడు. చట్టాన్ని రక్షించాల్సిన చేతులతోనే అక్రమాలకు తెరలేపాడు. పోలీసు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, దాయాదుల మధ్య చిచ్చుపెట్టి రూ.70 లక్షల విలువైన ఎకరం మూడు గుంటల భూమిని తన పేరిట పట్టా చేయించుకున్న దారుణ ఘటన తాండూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో వెలుగుచూసింది.
కుట్రపూరితంగా భూమి హస్తగతం
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మాపూర్ గ్రామానికి చెందిన దాయాదుల మధ్య ఉన్న చిన్నపాటి తగాదాలను ఆసరాగా చేసుకున్న తాండూరు స్పెషల్ బ్రాంచ్/క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ (జవాన్), వారి మధ్య మరింత గొడవలు పెంచాడు. ఈ క్రమంలోనే చాకచక్యంగా వ్యవహరించి దాదాపు రూ.70 లక్షల మార్కెట్ విలువ కలిగిన ఎకరం మూడు గుంటల భూమిని అన్యాయంగా తన పేరిట పట్టా చేసుకున్నాడు.
అధికార గర్వంతో బెదిరింపులు
బాధితులు తమ భూమి గురించి ప్రశ్నించగా సదరు కానిస్టేబుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. "నేనే పోలీస్‌‌ను... నా కంట్రోల్‌లోనే ఎస్పీ, డీఎస్పీ, సీఐలు ఉంటారు. నన్నెవరూ ఏమీ చేయలేరు" అంటూ బెదిరింపులకు దిగినట్లు బాధితులు వాపోతున్నారు. ఈ అక్రమ భూదందాలో గ్రామానికి చెందిన ఓ రేషన్ షాప్ డీలర్ సదరు కానిస్టేబుల్‌కు పూర్తి అండదండలు అందిస్తూ చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ట్రాక్టర్‌తో దౌర్జన్యం.. భయాందోళనలో బాధితులు
బాధితుల భూమిలోకి ఏకంగా ట్రాక్టర్‌ను తీసుకెళ్లి దున్నిస్తూ, "ఈ భూమి నాదే" అని దౌర్జన్యానికి దిగుతున్నాడు. ఖాకీ చొక్కా అహంకారంతో ఒక సామాన్య కుటుంబానికి చెందిన విలువైన భూమికి ఎసరు పెట్టడంపై హన్మాపూర్ గ్రామంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
పోలీసు పవర్ చూపిస్తూ దౌర్జన్యానికి దిగుతున్న సదరు కానిస్టేబుల్, అతనికి సహకరిస్తున్న రేషన్ డీలర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై వికారాబాద్ జిల్లా పోలీస్ సూపర్ ఇంటెండెంట్ (ఎస్పీ) ని కలిసి ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags: