_ తాండూరు పట్టణ మున్సిపాలిటీలో నిర్లక్ష్యం!
_ పాలకవర్గం, అధికారుల తీరుపై మండిపడ్డ కౌన్సిలర్ జావీద్
_ లైట్ల వేయడానికి స్తంభాలు ఎక్కిన కౌన్సిలర్..
_ రాబోయే రోజుల్లో మురికికాల్వలూ ఊడుస్తామని హెచ్చరిక
అభయం తాండూరు టౌన్: విధిదీపాలు బిగించడానికి స్వయంగా వార్డ్ కౌన్సిలర్ ఆ స్థంభం ఎక్కినా ఘటన తాండూరు మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలో ప్రజా సమస్యలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయని, స్థానిక పాలకవర్గం మరియు అధికారులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వార్డు కౌన్సిలర్ జావీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో నెలకొన్న వీధి దీపాల కొరత, పారిశుద్ధ్య లోపాలపై శుక్రవారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ జావీద్ మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలలు గడుస్తున్నా, పట్టణంలోని 36 వార్డుల్లో కనీస వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. తన వార్డు పరిధిలో 300 నుండి 400 వరకు విద్యుత్ స్తంభాలు ఉంటే, కేవలం 18 లైట్లను మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటాయించిన లైట్లకు సైతం నిర్వహణ సిబ్బంది లేకపోవడంతో సమస్య సంక్లిష్టంగా మారిందని, వారం రోజులుగా తిప్పలు పడ్డా అధికారులు పట్టించుకోకపోవడంతో తామే స్వయంగా స్తంభాలు ఎక్కి లైట్లు బిగించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు శాలువాల సన్మానాలు, రిబ్బన్ కటింగ్లకే పరిమితమవుతున్నారే తప్ప, క్షేత్రస్థాయికి వచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
పట్టణంలో పారిశుద్ధ్య, విద్యుత్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. పేపర్లపై కార్మికుల హాజరు మెండుగా చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, డిజిటల్ బిన్లు, డీజిల్ వినియోగం వివరాలపై ఆర్‌టిఐ ద్వారా సమాచారం కోరినా మున్సిపల్ అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు.
మున్సిపల్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని కౌన్సిలర్ జావీద్ హెచ్చరించారు.







