_ కౌన్సిలర్ బంటు వేణు చొరవ
_ వార్డ్ అభివృద్ధి కోసం కృషి..!
అభయం తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో కొన్ని నెలలుగా పరిష్కారానికి నోచుకోని పారిశుధ్య సమస్యలపై స్థానిక కౌన్సిలర్ బంటు వేణు తక్షణమే స్పందించారు. వార్డు వీధుల్లో విపరీతంగా పెరిగిన ముళ్లపొదలు, పేరుకుపోయిన చెత్తాచెదారం కారణంగా స్థానిక ప్రజలు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను గమనించిన ఆయన, స్వయంగా సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు.
అధికారిక నిధుల మంజూరు కోసం వేచి చూడకుండా, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తన సొంత ఖర్చులతో జేసీబీ యంత్రాన్ని సమకూర్చారు. శనివారం వార్డు వ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించి, ప్రధాన రహదారుల పక్కన ఉన్న ముళ్లపొదలను పూర్తిగా తొలగించారు. అదేవిధంగా, డ్రెయిన్లలో పూడిక పేరుకుపోయి మురుగు నీరు నిలిచిపోయిన నాలాలను జేసీబీ ద్వారా శుభ్రం చేయించి నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బంటు వేణు మాట్లాడుతూ... 11వ వార్డు ప్రజల సంక్షేమం, ఆరోగ్య భద్రతే నా ప్రథమ ప్రాధాన్యమన్నారు. వార్డు వాసులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. పరిశుభ్రమైన, రోగరహిత వార్డుగా రూపుదిద్దడమే నా లక్ష్యం అని వ్యాఖ్యానించారు.
సమస్య తెలియగానే స్పందించి, తన సొంత నిధులతో పారిశుధ్య పనులు చేపట్టిన కౌన్సిలర్ చొరవను 11వ వార్డు కాలనీవాసులు, స్థానిక ప్రజలు హర్షిస్తూ ధన్యవాదాలు తెలిపారు.







