Tandur

స్మశానాల ఘోష... రేపే 'ఆత్మగౌరవ' దీక్ష!

By · · Updated

Share this article
స్మశానాల ఘోష... రేపే 'ఆత్మగౌరవ' దీక్ష!

_ శ్మశాన వాటికల అభివృద్ధికై ‘ఆత్మగౌరవ దీక్ష

_ రూ. 5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి

_ తాత్కాలిక పనులు వద్దు... శాశ్వత పరిష్కారమే కావాలి

_ రేపు అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన: బీసీ సంఘం నేత రాజ్‌కుమార్ కందుకూరి

అభయం తాండూరు టౌన్: తాండూర్ పట్టణంలోని శ్మశాన వాటికల సమగ్ర అభివృద్ధికి రూ. 5 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రేపు మంగళవారం స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలి వద్ద ‘ఆత్మగౌరవ దీక్ష’ నిర్వహించనున్నట్లు బీసీ సంఘం తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి తెలిపారు. ఈ సందర్బంగా అయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ....పట్టణంలో శ్మశాన వాటికల సమస్య గత పదేళ్లుగా వేధిస్తోందన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధి కోసం బీసీ సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, ధర్నాలు, మున్సిపల్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించామని, అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పటించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న శ్మశాన వాటికల్లో పిచ్చిచెట్లు, పొదలు పెరిగితే గత రెండేళ్లుగా తన సొంత ఖర్చులతో జేసీబీల ద్వారా తాత్కాలికంగా శుభ్రం చేయించానని గుర్తుచేశారు. కేవలం తాత్కాలిక పనులతో సరిపెట్టకుండా శ్మశాన వాటికలను పూర్తిస్థాయిలో ఆధునీకరించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
తాండూర్ పట్టణంలోని అన్ని శ్మశాన వాటికల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా రూ. 5 కోట్లు కేటాయించాలన్నారు. 
 ప్రహరీ గోడలు, గేట్లు, అంతర్గత రోడ్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు, షెడ్లు, దహన వేదికలు మరియు పారిశుధ్య వసతులు కల్పించాలని, అవసరమైన చోట వైకుంఠధామాలుగా అభివృద్ధి చేయాలన్నారు. 
మల్‌రెడ్డిపల్లి ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక శ్మశాన వాటిక స్థలాన్ని గుర్తించి కేటాయించాలని,
గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లను పరిశీలించి అమలు చేయడంతో పాటు, పనుల పూర్తికి స్పష్టమైన కాలపరిమితి ప్రకటించాలన్నారు. నిరంతర పరిశుభ్రతకు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. 
మనిషి అంతిమ ప్రయాణంలో ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన వీడ్కోలు లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సెప్టెంబరు 29న ఉదయం 11:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ ‘ఆత్మగౌరవ దీక్ష’కు పట్టణంలోని అన్ని కుల, ప్రజా సంఘాల ప్రతినిధులు, బీసీ నాయకులు, మేధావులు, మహిళలు, యువత, వ్యాపారవేత్తలు మరియు బాధ్యతగల పౌరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు.

Tags: