_ శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.5 కోట్లు ఇవ్వాల్సిందే
_ తాండూర్ అంబేద్కర్ చౌక్‌లో 'బీసీ ఆత్మగౌరవ దీక్ష' హోరెత్తింది
_ 16 కుల సంఘాలు, వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఐక్యపోరాటం
అభయం తాండూరు న్యూస్: తాండూర్ పట్టణంలోని బీసీ శ్మశాన వాటికల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే రూ. 5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యలకు తాత్కాలిక పూతలు కాకుండా, అన్ని వసతులతో శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ మేరకు మంగళవారం అంబేద్కర్ కూడలిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో 'బీసీ ఆత్మగౌరవ దీక్ష' నిర్వహించారు.
మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ, శ్మశాన వాటికల అభివృద్ధి కోసం కూడా దీక్షలు చేయాల్సి రావడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. రాబోయేది బీసీల రాజ్యమే అని ఆయన స్పష్టం చేశారు. బీసీల హక్కుల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని రిటైర్డ్ అదనపు ఎస్పీ మధుసూదన్ రావు ప్రకటించారు. బీసీల పోరాటానికి బీజేపీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యు. రమేశ్ కుమార్ తెలిపారు. ఈ దీక్షకు పట్టణంలోని రజక, వడ్డెర, యాదవ, నాయి బ్రాహ్మణ, రాజ్‌పుత్, మత్స్యకార, ముదిరాజ్, వాల్మీకి, కురువ, విశ్వకర్మ, ఆరెకటిక, వీరశైవ, మున్నూరు కాపు, సాగర, భవసార క్షత్రియ, జాండ్ర సహా 16 కుల సంఘాలు, దళిత సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపాయి.
కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు సయ్యద్ షుకుర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింలు, జిల్లా నాయకుడు గడ్డం వెంకటేష్, వివిధ సంఘాల నాయకులు కృష్ణ, సత్యనారాయణ, మల్లేశం, పరమేష్, అంజిలప్ప, ఎస్పీ రవి, నరసింహులు, పూజారి పండు, సురేష్, దత్తు, సిద్ధిలింగం, రవి, రాము, మంతటి రాజు, బసవరాజ్, పండు గౌడ్, హరి ప్రసాద్, టైలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.







