_ కాలానుగుణ ఫ్లూపై జాగ్రత్తలు తప్పనిసరి
_ వాతావరణ మార్పులతో హెచ్చరిస్తున్న ఫ్లూ ప్రమాదం
_ చిన్నారులు, వృద్ధులపై సీజనల్ ఫ్లూ ప్రభావం ఎక్కువ
_ డాక్టర్ వై. సాయి రెడ్డి సూచన
అభయం తాండూర్ టౌన్: వాతావరణ మార్పుల వల్ల సంభవించే సీజనల్ ఫ్లూ వ్యాప్తి పట్ల ప్రజలు అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలని యశోద ఆసుపత్రి శ్వాసకోశ నిపుణులు డాక్టర్ వై. సాయి రెడ్డి తెలిపారు. బాధితులు దగ్గడం, తుమ్మడం లేదా మాట్లాడటం వల్ల వచ్చే నీటి తుంపర్ల ద్వారా ఈ వైరస్ విస్తరిస్తుందని పేర్కొన్నారు.
సాధారణ జలుబుతో పోలిస్తే ఫ్లూ లక్షణాలు వేగంగా తీవ్రమవుతాయని.. అకస్మాత్తుగా అధిక జ్వరం, పొడి దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట మరియు ఆకలి తగ్గడం వంటివి దీని ప్రధాన సంకేతాలని వివరించారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారు ఈ వైరస్ బారినపడే ప్రమాదం ఎక్కువని, వీరు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అనారోగ్యంతో ఉన్నవారికి తగినంత దూరం పాటించాలని, లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే తగిన విశ్రాంతి తీసుకుంటూ, ద్రవ పదార్థాలు ఎక్కువగా సేవించాలని సూచించారు.
స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహా తీసుకోవాలని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీలో నొప్పి ఉంటే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. యశోద ఆసుపత్రిలో ఆధునిక పరికరాలు, నిపుణులైన వైద్య బృందం అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.







