Tandur

రికార్డు సృష్టించబోతున్న లడ్డు వేలం. .!

By · · Updated

Share this article
రికార్డు సృష్టించబోతున్న లడ్డు వేలం. .!

_ భాగ్యనగరానికి దీటుగా తాండూరు గణేష్ ఉత్సవాలు

_ రూ.లక్షలు పలికే 'లడ్డూ వేలం'పై సర్వత్రా ఆసక్తి!

అభయం ప్రతినిధి తాండూరు: రాష్ట్ర రాజధాని భాగ్యనగరం (హైదరాబాద్) తర్వాత వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగే ప్రాంతాలలో తాండూరు ప్రథమ వరుసలో నిలుస్తుందని చెప్పవచ్చు. వినాయక చవితి  సందర్భంగా పట్టణంలోని వీధివీధినా వెలసిన గణనాథుల మండపాలు, భక్తుల జయజయధ్వానాలు, వర్ణరంజిత విద్యుత్ దీపాల కాంతులతో తాండూరు లంబోదరుడి దివ్య రూపంతో విరాజిల్లుతోంది. ఇక్కడి ఉత్సవాలు ఏటా అందనంత ఎత్తులో నిలుస్తూ పరిసర ప్రాంతాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తాండూరు వినాయక చవితి ఉత్సవాల్లో అత్యంత ఆకర్షణీయమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం స్వామివారి ప్రసాదమైన 'లడ్డూ వేలం పాట'. ఈ లడ్డూను దక్కించుకుంటే ఆయురారోగ్యాలు, వ్యాపారాభివృద్ధి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల బలమైన నమ్మకం. దీంతో స్థానిక వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పోటీపడి వేలంలో పాల్గొంటారు.
 గత సంవత్సరం తాండూరు లో గణనాథుడి లడ్డూ వేలం దాదాపు రూ. 4 లక్షల పైచిలుకు ధర పలికి వార్తల్లో నిలిచింది. గత రికార్డులను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది లడ్డూ వేలం ధర మరిన్ని కొత్త రికార్డులను సృష్టిస్తుందా? ఈసారి వేలం పాట ఏ స్థాయికి చేరుతుందోనని పట్టణ ప్రజలతో పాటు భక్తులలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
తాండూరులోని పలు ప్రధాన మండపాల వద్ద శోభాయాత్ర, నిమజ్జనంతో పాటు లడ్డూ వేలం పాట కోసం ఉత్సవ సమితులు, పోలీసులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Tags: