_ తాండూరులో ప్రైవేట్ విద్యా 'మాఫియా' దౌర్జన్యం
_ 12 గంటలపాటు కుర్చీలకే బందీలుగా విద్యార్థులు!
_ ప్రభుత్వ ఆదేశాలు తుంగలో.. సొంత రాజ్యాంగం అమలు!
_ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నరకయాతన.. రోబోలుగా మారుతున్న చిన్నారులు
_ మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు.. పట్టించుకోని జిల్లా యంత్రాంగం!
తాండూరు అభయం: తాండూరు పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల అరాచకాలు హద్దులు దాటాయి. ప్రభుత్వ నిబంధనలను, విద్యాశాఖ ఆదేశాలను బూట్ల కింద తొక్కేస్తూ తమ సొంత ‘కూర్మాసన’ రాజ్యాంగాన్ని చలామణి చేస్తున్నాయి. చదువు పేరిట ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు—ఏకంగా 12 గంటల పాటు పసిమొగ్గలను తరగతి గదుల్లో బంధించి పిప్పి చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.
ఉదయం కన్ను విప్పింది మొదలు రాత్రి పూట ఇళ్లకు చేరేవరకు విద్యార్థులను మనుషులుగా కాకుండా కేవలం మార్కులు తెచ్చే రోబోలా మారుస్తున్నారు. ఆటపాటలు, సృజనాత్మకత అనే పదాలకే తావులేకుండా చేసి, విపరీతమైన పుస్తకాల మోతతో విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనలోకి నెట్టేస్తున్నారు. రాత్రి ఇళ్లకు వచ్చేసరికి పిల్లలు ప్రాణమున్న శవాల్లా మారుతుంటే, కనీసం తల్లిదండ్రులతో కాసేపు ప్రశాంతంగా మాట్లాడే సమయం కూడా దక్కడం లేదు. వ్యాపార ధోరణితో ప్రైవేట్ యాజమాన్యాలు ఆడుతున్న ఈ ర్యాంకుల వేటలో పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి పోతోందని మేధావులు మండిపడుతున్నారు.
తాండూరులో ప్రైవేట్ విద్యాసంస్థలు బహిరంగంగానే రూల్స్ బ్రేక్ చేస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు కనీసం కన్నుతెరిచి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్ల పంపిణీ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్ యాజమాన్యాలకు కొమ్ముకాసే ధోరణి చూస్తుంటే తాండూరులో అసలు ప్రభుత్వ విద్యాశాఖ ఉందా? లేక ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో బందీ అయిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నిద్రమత్తు వదిలి తక్షణమే తాండూరులోని ప్రైవేట్ విద్యాసంస్థలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమయాతిక్రమణకు పాల్పడుతూ నిబంధనలు ధిక్కరిస్తున్న పాఠశాలలు, కళాశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేసి, లైసెన్సులు రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.







