_ ఉర్దూ పాఠశాలలో తీవ్ర సమస్యలు
– బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు
_ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.
అభయం తాండూరు: పట్టణంలోని 3వ వార్డులో ఉన్న ఉన్నత ఉర్దూ పాఠశాల సమస్యల వలయంలో చిక్కుకుందని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు బోధనా సిబ్బందిని వెంటనే నియమించాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్‌వీ నాయకుల బృందం పాఠశాలను సందర్శించి, సమస్యలపై విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే వార్డు పర్యటనలో భాగంగా పాఠశాలను సందర్శించి పెద్ద పెద్ద మాటలు చెప్పారే తప్ప, సమస్యల పరిష్కారానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కేవలం పరిశీలనలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
పాఠశాలలో ప్రదానంగా గణితం, సాంఘిక శాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక విద్యాబోధన మందగించిందన్నారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా గుడ్లు అందించడం లేదని, భోజనంలో నాణ్యత లోపించిందని అభ్యాసకులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టాయిలెట్ సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే బియ్యం బస్తాలు, పెయింట్ డబ్బాలు, కంప్యూటర్లు నిల్వ చేయడంతో ఆ ప్రాంగణం ఇరుకుగా మారిపోయిందన్నారు.
ఈ సమస్యలన్నింటిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని, పాఠశాలలో పూర్తిస్థాయి వసతులు కల్పించే వరకు బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు వినోద్ కుమార్, కొర్ర సందీప్ నాయక్, మహేశ్వర్ రెడ్డి, అబ్దుల్ అశ్వక్, సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.







