– 24వ వార్డులో అలరించిన బతుకమ్మ వేడుకలు
– వేడుకలను పర్యవేక్షించిన కౌన్సిలర్ బాలకృష్ణ రెడ్డి
_ పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి
తాండూరు, అక్టోబర్ 18 (అభయం న్యూస్): తాండూరు పురపాలక సంఘం పరిధిలోని 24వ వార్డు మాల్రెడ్డిపల్లిలో బతుకమ్మ సంబురాలు కన్నులపండువగా సాగాయి. స్థానిక కౌన్సిలర్ బాలకృష్ణ రెడ్డి సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాలనీ వీధులన్నీ పూల పరిమళాలు, గౌరమ్మ పాటలతో మురిసిపోయాయి. ఈ వేడుకలకు మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, యువతులు రకరకాల తంగేడు, గునుగు, చామంతి పూలతో అందంగా తయారుచేసిన బతుకమ్మలను ప్రదర్శించారు. అనంతర బతుకమ్మలను కొలువుదీర్చి, చుట్టూ చేరి "ఒక్కేసి పువ్వేసి చందమామ..." అంటూ పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతిని దైవంగా భావించి పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని కొనియాడారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వార్డు ప్రజలంతా ఐకమత్యంతో పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఆడపడుచులందరికీ ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు.







