_ పేదలకు నాణ్యమైన వైద్యమే ధ్యేయం
_ వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
_ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హెచ్చరిక
_ జిల్లా ఆసుపత్రి, మాతాశిశు ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీ
_ అభివృద్ధి పనులకు రూ.4 కోట్లు మంజూరు
తాండూరు, అక్టోబరు 15 (అభయం న్యూస్): ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా డాక్టర్లు, సిబ్బంది బాధ్యతాయుతంగా సేవలు అందించాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు మాతాశిశు ఆసుపత్రి లను ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించారు.
ముందుగా ఆసుపత్రిలోని పలు వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా లేదా అన్న అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆసుపత్రిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. త్వరలోనే పనులు ప్రారంభించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న ఐసీయూ విభాగం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని, రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి కొండంత భరోసా కల్పించాలని సూచించారు. వృత్తిపరమైన నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డిసీఎంఎచ్ ఆనంద్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజాక్ మాలిక్, పలువురు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.







