_ కామన్ మాన్ గా సేవలు చేస్తున్న
_ నిరాధార ఆరోపణలు సహించేది లేదు
_ ప్రజాసేవను బలహీనతగా భావించవద్దు
– ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కాంగ్రెస్ నేత సవాల్
_ జడ్పీ చైర్మన్ అవ్వాలని ఆశగా ఉంది
_ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వెల్లడి..!
అభయం తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి తాను చేస్తున్న సేవలను రాజకీయ విమర్శలతో ముడిపెట్టడం సరికాదని, తన మౌనాన్ని బలహీనతగా భావించి నిరాధార ఆరోపణలు చేస్తే ఇకపై సహించేది లేదని ఆర్బిఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.
తాను ఒక సాధారణ పౌరుడినని, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం సేవలో భాగమే తప్ప 'షాడో ఎమ్మెల్యే' సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఏ విషయంలోనూ అధికార దుర్వినియోగం లేదా ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని తేల్చిచెప్పారు. 111 జీవో భూములు, ఆలయ ప్రాంగణ నిర్మాణాలు, 'ఇవాక్యు ప్రాపర్టీ' వ్యవహారాల్లో తనపై వస్తున్న వ్యాఖ్యలన్నీ కేవలం అసత్య ప్రచారాలేనని కొట్టిపారేశారు.
రాజకీయాల్లోకి రాకముందే జిల్లాలోనే అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తుల్లో ఒకడిగా ఉన్నానని, అక్రమ సంపాదన చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. జడ్పీ చైర్మన్ పదవికి పోటీ చేసే ఆసక్తి ఉన్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారని, ధైర్యముంటే ఆధారాలతో ముందుకు రావాలని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టపరంగా తగిన విధంగా స్పందిస్తానని తేల్చిచెప్పారు.







