_ యాలాల మండలంలో అగ్నిప్రమాదం, ఇల్లు దగ్ధం
_ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు
_ రూ. 50 వేల నగదు, ఇంట్లోని వస్తువులు బుడిద
_ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి
యాలాల్, అక్టోబర్ 12 (అభయం న్యూస్):
మండల పరిధిలోని రాస్నం గ్రామంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు పూర్తిగా కాలిపోయి, ఇంట్లోని సామాగ్రితో పాటు గృహిణి దాచుకున్న సొమ్ము కూడా బూడిదైన సంఘటన స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే...
రాస్నం గ్రామానికి చెందిన కుమ్మరి బిచ్చమ్మ ఇంట్లో ఉదయం ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. మీటర్ వైర్ల నుండి ఎగిసిపడిన అగ్నిరవ్వలు ఇంటి పైకప్పుపై పడటంతో క్షణాల్లోనే మంటలు ఎగిసిపడ్డాయి. వర్షకాలం కావడం, ఇల్లు పాతది కావడంతో మంటలు వేగంగా వ్యాపించి ఇల్లంతా విస్తరించాయి.
ఈ ప్రమాదంలో ఇంట్లోని దూలాలు, వాసాలు విరిగిపడటంతో పాటు బట్టలు, నిత్యావసర సరుకులు, ఇతర గృహోపకరణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అంతేకాకుండా అవసరాల కోసం దాచుకున్న సుమారు రూ. 50,000/- నగదు కూడా మంటల్లో కాలిపోయాయని బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు.
సమాచారం అందుకున్న గ్రామస్థులు మంటలను అదుపు చేసేలోపే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సర్వస్వం కోల్పోయి వీధిపాలు అయ్యామని, నిరుపేద కుటుంబమైన తమను ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు మానవత్వంతో ఆదుకుని తగిన నష్టపరిహారం అందించాలని బాధితురాలు బిచ్చమ్మ తహసీల్దార్ కు విజ్ఞప్తి చేసింది.







