_ తాండూరు మాతా శిశు, జిల్లా ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీ
— చికిత్స అందుతున్న తీరుపై రోగులతో ఆరా తీసిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
— ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశం
తాండూరు, అక్టోబర్ 15 (అభయం న్యూస్): తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆస్పత్రిని, జిల్లా ఆస్పత్రిని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ఆస్పత్రులలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు.
వార్డుల వారీగా తిరిగి, చికిత్స పొందుతున్న రోగులు మరియు వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఆస్పత్రిలో వైద్యం ఎలా అందుతోంది? డాక్టర్లు, సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉంటున్నారా? మందులు బయట నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందా? లేదా? అని రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రోగులు తమకు ఎదురవుతున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిపై సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులకు పేద ప్రజలే ఎక్కువగా వైద్యం కోసం వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి, మెరుగైన వైద్యం అందేలా అంకితభావంతో పనిచేయాలని ఆయన సిబ్బందికి సూచించారు.







