_ ప్రభుత్వ ఆసుపత్రి వైఫల్యానికే తల్లి, బిడ్డ బలి
_ వైద్యుల నిర్లక్ష్యంతోనే దారుణం
_ బీసీ నేత కందుకూరి రాజ్‌కుమార్ ఆరోపణ
_ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
అభయం తాండూరు న్యూస్ :ప్రసవానికి వచ్చిన తల్లి, కొత్తగా లోకంలోకి రావలసిన బిడ్డ ప్రాణాలను కూడా కాపాడలేని స్థితిలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ తయారైందని, అధికారుల వైఫల్యం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల ప్రాణాలకు అసలు భద్రత లేదా అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
జిన్నూర్తి గ్రామానికి చెందిన బాలమణి ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. బాధితురాలి తండ్రి పాలిష్ మిషన్‌లో లేబర్‌గా పనిచేస్తూ ముగ్గురు కుమార్తెలను పోషిస్తున్నారని, అందులో పెద్ద కుమార్తె అయిన బాలమణికి ఏడాది క్రితం కర్ణాటకలోని సేడం ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైందని తెలిపారు. గర్భం దాల్చిన అనంతరం ప్రసవం కోసం పుట్టింటికి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, వైద్య సేవల్లో జరిగిన లోపాల వల్లే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.
ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాలమణి కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించి ఆదుకోవాలన్నారు. పేద ప్రజలు నమ్మి వచ్చే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం రాజ్‌కుమార్ జిన్నూర్తి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, వడ్డెర సమాజం అధ్యక్షులు రాములు, నాయకులు అంజి, హన్మంతు, సురేష్, వెంకటేష్, ప్రవీణ్, భీమశంకర్, రాజు, వినయ్, కృష్ణ తదితరులు పాల్గొని తమ సానుభూతి తెలిపారు.







