_ దివ్యాంగురాలి వాహన కొనుగోలుకు రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేత
_ పెద్దేముల్ మండలంలో హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
పెద్దేముల్, అక్టోబర్ 18 (అభయం న్యూస్): ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనే అసలైన ప్రజా నాయకుడి లక్షణం ఉంటుందని తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి మరోసారి నిరూపించారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆయన, బండమీదిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలి కుటుంబానికి ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేసి మానవతా చాటుకున్నారు.
పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామంలో గతంలో ఎమ్మెల్యే పర్యటన చేపట్టారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన చాకలి పుష్పమ్మ కుటుంబాన్ని కలిసిన ఆయన.. వారి కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో పుష్పమ్మ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, తమ కుటుంబంలోని దివ్యాంగురాలు ప్రయాణానికి పడుతున్న అవస్థలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దివ్యాంగురాలి ప్రయాణ సౌలభ్యం కోసం ప్రత్యేక వాహనం కొనుగోలు నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా 'బీఎంఆర్ ఫౌండేషన్' ద్వారా రూ. 50,000/- ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేశారు. కష్టాన్ని గుర్తించి, ఇచ్చిన మాట ప్రకారం సాయం అందించిన ఎమ్మెల్యే కు చాకలి పుష్పమ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా అర్హులైన నిరుపేదలకు ఫౌండేషన్ ద్వారా నిరంతరం అండగా నిలుస్తామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.







