_ భక్తిశ్రద్ధలతో ముగిసిన వినాయక చవితి వేడుకలు
_ రూ. 75 వేలకు లడ్డూను దక్కించుకున్న భద్రేశ్వర ఆలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్
_ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి లడ్డూ ప్రసాదం అందజేత
అభయం ప్రతినిధి తాండూరు;తాండూరు పట్టణంలో ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, నయన మనోహరంగా సాగిన వినాయక నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ముగిశాయి. నిత్య ధూపదీప నైవేద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వనుల నడుమ పూజలందుకున్న బొజ్జ గణపయ్యలకు నిర్వాహకులు శోభాయాత్రగా తరలివెళ్లి నిమజ్జనం నిర్వహించారు.
పోటీగా సాగిన లడ్డూ వేలం పాట
ఉత్సవాల ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శాంతినగర్లో వెలసిన వినాయక మండపం వద్ద స్వామివారి దివ్య లడ్డూ ప్రసాద వేలం పాటను నిర్వహించారు. భక్తులు పోటాపోటీగా పాల్గొన్న ఈ వేలం పాటలో భద్రేశ్వర ఆలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ పోటీ నడుమ రూ. 75,000 లకు లడ్డూను చేజిక్కించుకున్నారు. గణనాథుడి ప్రసాదాన్ని దక్కించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
వేలంలో లడ్డూను పొందిన అనంతరం పటేల్ కిరణ్, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణంలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, భక్తిపారవశ్యంతో జరగడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఆ వినాయకుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. ఎమ్మెల్యే మనోహర్ రాబోయే రోజుల్లో ఆ వినాయకుడి ఆశీస్సులతో మరెన్నో పదవులు పొందాలని కోరుతూ లడ్డు ను ఎమ్మెల్యే కు ఇచ్చినట్టు పటేల్ కిరణ్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, శాంతినగర్ కాలనీవాసులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







