_ 15 ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యం..
_ మల్రెడ్డిపల్లిలో చావుకు కూడా స్థలం లేని పరిస్థితి!
_ స్మశాన వాటిక కోసం 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే కేటాయించాలి.
_ బీసీ సంఘాలు అండగా నిలవాలి: మల్రెడ్డిపల్లి యువకుడు సిరి యాదవ్ ఆగ్రహం.
అభయం తాండూరు టౌన్: పట్టణం లో ప్రాథమిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం మరియు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారని మల్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు సిరి యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్ష లో సిరి యాదవ్ మాట్లాడుతూ.... మనిషి బ్రతికున్నప్పుడు నీడ లేకపోయినా భరిస్తాడు, కానీ చనిపోయాక దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా స్థలం లేకపోవడం అత్యంత దౌర్భాగ్యకరమన్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా మా స్మశాన వాటిక సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇచ్చే హామీలు గెలిచిన తర్వాత నీటిమూటలవుతున్నాయి అని మండిపడ్డారు.
1వ వార్డ్, 24వ వార్డ్ లలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి సరైన స్థలం లేదన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు పడుతున్న నరకయాతన వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద, బహుజన వర్గాలు ఎక్కువగా ఉన్న మాల్రెడ్డి పల్లి లో స్మశాన వాటిక సమస్య తీవ్రంగా ఉందని, ఈ న్యాయమైన పోరాటంలో బీసీ సంఘాల నాయకులు మరియు సభ్యులు తక్షణమే స్పందించి మల్రెడ్డిపల్లి ప్రజలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
మల్రెడ్డిపల్లి గ్రామానికి తక్షణమే 2 ఎకరాల ప్రభుత్వ భూమిని స్మశాన వాటిక కోసం కేటాయించాలన్నారు.
స్మశాన వాటికకు సరిహద్దు గోడ నీటి సదుపాయం, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి స్మశాన వాటికకు భూమి కేటాయించాలని ప్రజల అవస్థలను పట్టించుకోని స్మశాన వాటిక కు సహకారం అందించాలని ఈ సందర్బంగా సిరి యాదవ్ కోరారు.







