_ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
_ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నాయకుడు ప్రభాకర్ గౌడ్
అభయం తాండూరు న్యూస్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్ వద్ద శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బాపు ఘాట్‌ను సందర్శించి గాంధీజీ సమాధి వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు మాజీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తో పాటు పలువురు శాసనసభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని జాతిపితకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... మహాత్మా గాంధీ బోధించిన అహింసా సిద్ధాంతం, శాంతి మార్గం ప్రపంచానికే దిశా నిర్దేశం చేశాయని కొనియాడారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన అందిస్తోందని తెలిపారు. బాపు చూపిన బాటలో నడుస్తూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.







