_ పారిశుధ్య కార్మికులకు 'దసరా' కానుకలు
_ 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ ఉదారత
_ సిబ్బందికి దుస్తులు, నగదు పంపిణీ
తాండూరు, అక్టోబరు 20 (అభయం న్యూస్): విజయదశమి పండగను పురస్కరించుకుని తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ తన ఉదారతను చాటుకున్నారు. వార్డులో నిరంతరం సేవలందిస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, లేబర్లు మరియు వార్డు జవాన్లకు ఆయన తన స్వంత ఖర్చులతో పండగ తోఫాగా కొత్త దుస్తులు, కొంత నగదును బహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ జావీద్ మాట్లాడుతూ... పట్టణాన్ని, వార్డును పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య సిబ్బంది పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు. ప్రజా ఆరోగ్యం కోసం ప్రతిరోజూ కష్టపడే కార్మికుల ముఖాల్లో పండగ వేళ ఆనందం నింపాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న కానుకను అందజేసినట్లు తెలిపారు. వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కోరారు.
అనంతరం 8వ వార్డు ప్రజలకు, తాండూరు పట్టణ నివాసులందరికీ ఆయన విజయదశమి దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. కౌన్సిలర్ జావీద్ చేసిన ఈ సేవను పారిశుధ్య సిబ్బంది కొనియాడుతూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు జవాన్ అశోక్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







