Tandur

కాంగ్రెస్ తెచ్చిన 'కరువు'..!

By · · Updated

Share this article
కాంగ్రెస్ తెచ్చిన 'కరువు'..!

_ ఇది ప్రభుత్వ వైఫల్యమే, ఎల్‌నినోపై ముందస్తు చర్యలు ఏవి?

_ కరెంట్ కోతలతో మళ్లీ ఇన్వర్టర్ల కాలం వచ్చింది

_ సింగరేణిని అమ్మే కుట్ర చేస్తే ప్రజా ఉద్యమం తప్పదు

_ తాండూరు వనరులు కొడంగల్‌కు ధారాదత్తం

_ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

తాండూరు, అక్టోబర్ 15(అభయం న్యూస్): రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, ఎటుచూసినా కనిపిస్తున్న కరెంట్ కోతలు, రైతుల పంట నష్టాలకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్‌నినో ప్రభావాన్ని ముందస్తుగా అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోహిత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో కనిపించకుండా పోయిన జనరేటర్లు, ఇన్వర్టర్లు మళ్లీ బయటకు తీసే దుస్థితి దాపురించిందని, కనీసం ఉన్న విద్యుత్‌ను కూడా సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలు, కరెంట్ కష్టాలు, సింగరేణి భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలో తాండూరులో భూగర్భ జలాల పెంపు కోసం కాగ్నా నదిపై 11 చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తే, నేటి కాంగ్రెస్ పాలనలో కాగ్నా ఇసుక దోపిడీ విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. తాండూరుకు చెందాల్సిన నీళ్లు, జిల్లా ఆస్పత్రిని కొడంగల్‌కు ధారాదత్తం చేశారని, చివరికి ఇక్కడి ఆర్టీఓ కార్యాలయాన్ని కూడా కొడంగల్‌కు తరలించేందుకు పట్రాంగం నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ జీవనాడి అయిన సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ప్రైవేటీకరణకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎండిపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం అందించి, కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: