_ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు బీసీ సంఘాల అభినందనలు
_ బీఆర్ఎస్, బీజేపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి: కందుకూరి రాజ్‌కుమార్
_ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్
అభయం తాండూరు టౌన్: శంషాబాద్ బహిరంగ సభలో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బీసీ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ చేసిన ప్రకటనను తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు స్వాగతించారు. ఈ ప్రకటనపై జాతీయ బీసీ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేష్‌కుమార్ గౌడ్ తన ప్రకటనకు కట్టుబడి కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించాలని, పార్టీలోని అన్ని వర్గాల నాయకులు ఈ అంశానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీలు కూడా బీసీ సీఎం అంశంపై తమ స్పష్టమైన వైఖరిని వెంటనే బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం ఒక స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని, స్థానిక సంస్థలు, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే సత్యనారాయణ, జిల్లా నాయకుడు గడ్డం వెంకటేష్, మహిళా ప్రతినిధులు మంజుల, నరసమ్మ, విజయలక్ష్మి, అనిత, మండలాల అధ్యక్షులు నరేందర్, లక్ష్మణ్ చారి, శ్రవణ్ కుమార్, నాయి బ్రాహ్మణ నాయకుడు పరమేష్, బీసీ నాయకులు రాము ముదిరాజ్, మంతటి రాజు, బసవరాజ్, జోసెఫ్, భరత్ గౌడ్, కిరణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.







