Tandur

ఘనంగా బతుకమ్మ వేడుకలు...!

By · · Updated

Share this article
ఘనంగా బతుకమ్మ వేడుకలు...!

_ భవానీనగర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

_ ఘనంగా వేడుకలు నిర్వహించిన కాలనీ వాసులు

_ వేడుకల్లో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్

తాండూరు,అక్టోబర్ 15(అభయం న్యూస్): తాండూరు మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు భవానీ నగర్‌లో సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు వైభవంగా, కోలాహలంగా జరిగాయి. కాలనీ వాసులందరూ ఒకేచోట చేరి సంతోషకర వాతావరణంలో ఈ సంబరాలను నిర్వహించారు.
వివిధ రకాల రంగురంగుల సహజ సిద్ధమైన పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను మధ్యలో ఉంచి, మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు చేతులు కలుపుతూ చప్పట్లు, కోలాటాల నడుమ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాడిన పాటలు కాలనీలో మార్మోగాయి.
ఈ వేడుకల్లో స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొని కాలనీ మహిళలు, ప్రజలతో కలసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు. ఐక్యమత్యానికి, ప్రకృతిని ఆరాధించడానికి ఈ పండుగ ప్రతీక అని తెలిపారు. వార్డు ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీ అభివృద్ధితో పాటు ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కౌన్సిలర్ హామీ ఇచ్చారు.

Tags: