అభయం తాండూరు ప్రతినిధి;
తాండూరు పట్టణంలో శుక్రవారం జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కోరారు. గురువారం ఆయన స్థానిక అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలతో పాటు అవసరమైన క్రేన్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహించామో, నిమజ్జనంలోనూ అంతే జాగ్రత్తలు వహించాలని, నిర్వాహకులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాన కూడళ్లు, ఘాట్ల పరిశీలన
సమావేశం అనంతరం వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాతో కలిసి ఎమ్మెల్యే పట్టణంలోని పాతతాండూరు, అంబేడ్కర్ పార్క్, భద్రప్పగుడి, శివాజీ చౌక్ తదితర ప్రధాన కూడళ్లను పరిశీలించారు. అనంతరం మల్‌రెడ్డిపల్లి, కోకట్ వాగు నిమజ్జన ఘాట్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.







