Tandur

ఎంపీడీవో ఆఫీసులో అవినీతి రచ్చ!

By · · Updated

Share this article
ఎంపీడీవో ఆఫీసులో అవినీతి రచ్చ!

_  బకాయి బిల్లు క్లియర్ చేసేందుకు రూ. 20,000 లంచం డిమాండ్
_  బహిరంగంగా ఆరోపణలు గుప్పించిన మాజీ సర్పంచ్ శంకర

_  ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని స్థానికుల డిమాండ్

అభయం బషీరాబాద్;  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలు స్థానిక రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వారి పట్ల కిందిస్థాయి అధికారుల తీరు ఏవిధంగా ఉందో అనడానికి ఈ ఘటన స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది.
మండలంలోని నాద్యనాయక్ తండా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ శంకర్ తన హయాంలో గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 1,20,000 పాత బకాయిలు విడుదల కాకపోవడంతో, ఆయన గత కొంతకాలంగా ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే, బిల్లులు పాస్ చేయాలంటే తక్షణమే రూ. 20,000 లంచం ముట్టజెప్పాలని కార్యాలయ సిబ్బంది పట్టుబడుతున్నారని ఆయన బహిరంగంగా ఆరోపించారు. అధికారుల ఆర్థిక వేధింపులు, కాలయాపన వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం గ్రామాల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తుంటే, క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం స్వప్రయోజనాల కోసం అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు బషీరాబాద్ మండలంలో వెల్లువెత్తుతున్నాయి. బిల్లుల మంజూరు పేరుతో నిరుపేద గ్రామాలకు సేవ చేయాల్సిన ప్రజా కార్యాలయాలు అక్రమ వసూళ్లకు అడ్డాలుగా మారుతున్నాయని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
ఈ అవినీతి వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఎలాంటి లంచాలు తీసుకోకుండా మాజీ సర్పంచ్‌కు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లంచం డిమాండ్ చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags: