_ ఓటరు నమోదులో వేగం పెంచాలి
_ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
_ సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ నాయక్, ఎమ్మెల్యేలు
తాండూరు, అక్టోబర్ 13(అభయం న్యూస్): రాబోయే రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టం చేశారు. ఢిల్లీలోని సీఎం నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, ఎమ్మెల్యేలు టి. రామ్మోహన్ రెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాలపై ముచ్చటించారు.
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... వికారాబాద్ జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని నేతలను ఆదేశించారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరు జాబితాలో చేరేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని, ఎవరూ మిగిలిపోకుండా చూడాలని పిలుపునిచ్చారు.







