_ తాండూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది అలసత్వం
_ చేతికి పార పట్టిన 23వ వార్డు కౌన్సిలర్
_ మున్సిపల్ కార్మికుడిలా డ్రైనేజీ పూడిక తీసిన అంతారం కిరణ్
_ అధికారుల తీరుపై తీవ్ర ఆవేదన.. వార్డు అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి
అభయం తాండూరు టౌన్; తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు వాల్మీకి నగర్ లో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ అంతారం కిరణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది సహకరించకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆయనే స్వయంగా మున్సిపల్ కార్మికునిగా మారి వార్డులోని డ్రైనేజీ పూడిక తీత పనులను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ అంతారం కిరణ్ మాట్లాడుతూ.. వాల్మీకి నగర్లో గత కొంతకాలంగా పారిశుద్ధ్యం క్షీణించడం, డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటం, తాగునీటి ఎద్దడి, వీధిలైట్లు వెలగకపోవడం వంటి సమస్యలపై ప్రజల నుంచి రోజూ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కానీ సంబంధిత సిబ్బందికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కనీస స్పందన కరువైందని మండిపడ్డారు.
వార్డు అభివృద్ధి పనులకు అధికారుల వైఖరి ఆటంకంగా మారుతోందని కౌన్సిలర్ ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు తావులేకుండా మున్సిపల్ సిబ్బంది, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి 23వ వార్డులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







