Tandur

దొంగలు దొరికారు...!

By · · Updated

Share this article
దొంగలు దొరికారు...!

_ ముగ్గురు పాత నేరస్థుల అరెస్ట్.. 8 తులాల బంగారం, రూ. లక్ష నగదు స్వాధీనం

 _ తాండూర్ బస్టాండ్ వద్ద పట్టుకున్న పోలీసులు

అభయం తాండూరు:  తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్థుల ముఠాను తాండూర్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1,00,000 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు  తాండూరు డిఎస్పీ  తెలిపారు.ఈ సందర్బంగా పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో డిఎస్పి నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ...తాండూర్ టౌన్ గాంధీనగర్‌కు చెందిన వెల్డింగ్ షాప్ యజమాని అబ్దుల్ జహీర్ ఈ నెల 13న తన భార్యతో కలిసి కర్ణాటకలోని సేడం వెళ్లారు. అదే రోజు రాత్రి తిరిగి వస్తూ ఫోన్‌లో ఇంటి సీసీ టీవీ దశాంశాలను చూడగా కెమెరాలు పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి చేరుకున్నారు. మెయిన్ డోర్ తాళం విరగ్గొట్టి, బీరువాలో ఉన్న 2 తులాల గోల్డ్ నెక్లెస్, 20 తులాల వెండి పట్టీలు, 19 తులాల కాళ్ల కడియాలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి బాధితుడు సెప్టెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మంగళవారం ఉదయం తాండూర్ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అరెస్టయిన వారిలో మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం లింగంపల్లికి చెందిన ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ అడుల బాబు (A-1), యాలాల్ మండలం కమాల్పూర్ నివాసి ఆటో డ్రైవర్ బోయిని శ్రీకాంత్ (A-2), తాండూర్ మార్కండేయ కాలనీకి చెందిన ట్రాక్టర్ మెకానిక్ కె. ప్రవీణ్ అలియాస్ కుమ్మరి ప్రవీణ్ (A-3) ఉన్నారు.
గతంలో దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లిన A-1, A-2లకు అక్కడ పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక A-3తో కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి వరుస చోరీలకు పాల్పడ్డారు. గత ఏడాది నవంబర్‌లో రాజీవ్ కాలనీలో 3 తులాల బంగారం, 50 తులాల వెండి, ఈ నెల 13న గాంధీనగర్‌లో దొంగతనం, అలాగే ఈ నెల 16న మిత్ర నగర్‌లోని ఒక ఇంట్లో 6 తులాల బంగారం, రూ. లక్ష నగదును చోరీ చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని డిఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమం లో పట్టణ సిఈ పరమేశ్వర్ గౌడ్, ఎస్ఐ విట్టల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags: