_ తాండూర్ వెంకటేశ్వర కాలనీలో విషాదం
_ రెండేళ్ల బాబును వదిలి అనంతలోకాలకు..
_ పోలీసులకు మృతురాలి బాబాయి ఫిర్యాదు
అభయం తాండూరు టౌన్: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
తాండూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఎం. రవిశంకర్ కుమార్తె ఎం. అలేఖ్య (23) కు, హైదరాబాద్ బదుగుపేటకు చెందిన ఇందిరాల అచ్యుత్తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి శ్రీ ఆడ్విక్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
పెళ్లయిన కొంతకాలానికే దంపతుల మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీంతో మనస్పర్ధలు తీవ్రమై గత రెండేళ్లుగా అలేఖ్య భర్తకు దూరంగా తాండూర్ లోని పుట్టింట్లోనే నివాసముంటోంది. అంతేకాకుండా వీరి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భర్త వేధింపులను తట్టుకోలేక అలేఖ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
సంఘటనపై మృతురాలి బాబాయి, ప్రభుత్వ ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్ మడుర్ శ్రీనివాస్ తాండూర్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ వేగవంతం చేశారు.







