_ తాండూరులో ఘనంగా సైకిల్ ర్యాలీ
_ పాల్గొన్న అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ, విద్యార్థులు
తాండూరు, అక్టోబరు 16 (అభయం న్యూస్): విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
స్థానిక ఇంద్రాచౌక్ వద్ద ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీని అదనపు ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.... సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, దేశ రక్షణకు పోలీసులు అందిస్తున్న సేవలు, అమరులైన పోలీసుల త్యాగాలను ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో పాటు పోలీస్ శాఖపై గౌరవాన్ని పెంపొందించడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశమన్నారు. సమాజంలో శాంతి పరిరక్షణకు పోలీస్ వ్యవస్థకు ప్రజలు ఎల్లవేళలా సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అమరుల త్యాగాలు చిరస్మరణీయం
By Vamshi · · Updated
Share this article







