_ శ్రీ సద్గురు పోట్లి మహారాజ్ దేవాలయ అభివృద్ధికి పెద్దపీట
_ నూతన వ్యాపార సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
_ గతంలో రూ.4 లక్షలు ఉన్న ఆలయ నిధులు రూ.40 లక్షలకు చేరిక
_ పారదర్శకత, జవాబుదారీతనంతోనే అభివృద్ధి పనులు
తాండూరు, అక్టోబర్ 15(అభయం న్యూస్): తాండూరు పట్టణంలోని పోట్లి మహారాజ్ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపుతున్నారని తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తాండూరు పట్టణంలో పోట్లి మహారాజ్ దేవాలయ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయ ( భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆలయ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గతంలో దేవాలయ ఖాతాలో కేవలం రూ.4 లక్షలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ఆ నిధులను పకడ్బందీగా నిర్వహించి రూ.40 లక్షలకు చేర్చగలిగామని వెల్లడించారు. భవిష్యత్తులో దేవాలయ ఆదాయాన్ని మరింత పెంచి, ఆ నిధులన్నింటినీ పూర్తిగా ఆలయ అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనకే వినియోగిస్తామని స్పష్టం చేశారు.
భక్తులకు, స్థానిక వ్యాపారులకు మరియు పట్టణ ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత పకడ్బందీ ప్రణాళికతో ఈ నూతన వ్యాపార సముదాయాన్ని నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. షాపుల కేటాయింపు మరియు నిర్మాణ పనుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పూర్తి పారదర్శకతను పాటించామని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చేపట్టే ప్రతి పనిలోనూ జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు.
ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శివాలయం, దాసోహం, మరియు రాజగోపురం నిర్మాణ పనులు ఎంతో రమణీయంగా రూపుదిద్దుకుంటున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పనులను ఎంతో శ్రద్ధతో, నిబద్ధతతో చేపడుతున్న నిర్వాహకులను, దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
శ్రీ సద్గురు పోట్లి మహారాజ్ దేవాలయాన్ని ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా అగ్రగామిగా నిలబెట్టుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భక్తులకు మరిన్ని మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించే దిశగా అందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు.







