– గణేష్ మండప నిర్వాహకులకు హిందూ ఉత్సవ సమితి విజ్ఞప్తి
– అత్యవసర సమయాల్లో ఉత్సవ సమితిని సంప్రదించాలి: కార్యదర్శి బిర్కట్ రఘు
అభయం ప్రతినిధి తాండూరు; గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో విజయంవంతం చేసేందుకు మండప నిర్వాహకులందరూ నిర్ణీత సమయపాలన పాటించాలని హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి బిర్కట్ రఘు కోరారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా, ఆటంకాలు లేకుండా పూర్తయ్యేందుకు మధ్యాహ్నం 2 గంటలకే ఊరేగింపును ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిమజ్జన ఊరేగింపులో పాల్గొనే గణేష్ మండప నిర్వాహకులకు ఉత్సవ సమితి తరఫున అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఉత్సవాల నిర్వహణ సమయంలో లేదా ఊరేగింపులో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా, ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఉత్సవ సమితి సభ్యులను సంప్రదించాలని సూచించారు.
భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు పోలీసు యంత్రాంగం మరియు స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.







